కురుపాం మండలం : “నేటి బాలలే రేపటి పౌరులు” అనే నినాదంతో, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గొట్టివాడ పంచాయతీ పరిధిలోని నేరడువలస గ్రామంలో ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ బాలల భవిష్యత్తు కోసం శ్లాఘనీయమైన కార్యక్రమాన్ని చేపట్టింది. మాజీ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా శుక్రవారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్ట్స్ సంస్థ డైరెక్టర్ ఎన్. సన్యాసి రావు మాట్లాడుతూ,
“పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకురావాలంటే మంచి విద్యతో పాటు ఉత్తమ వాతావరణం కూడా అవసరం. దీనికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇదే వారికి గొప్ప భవిష్యత్తుకు పునాది అవుతుంది” అని పేర్కొన్నారు.
పిల్లల విద్యను ప్రోత్సహించడానికి ఆర్ట్స్ సంస్థ విద్యార్థులకు పుస్తకాలు, పలకలు, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు పంపిణీ చేసింది. అదేవిధంగా, విద్యార్థుల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు బకెట్లు, జగ్గులు, సబ్బులు కూడా అందజేశారు.
కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ రజిని దుర్గ, ఆర్ట్స్ సంస్థ స్టేట్ కో-ఆర్డినేటర్ సందీప్, పలువురు ఫీల్డ్ కో-ఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










