జియ్యమ్మవలసమండలం (పార్వతీపురం మన్యం జిల్లా): గిరిజనుల ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజన పితామహుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి (జనజాతీయ గౌరవ్ దివస్) సందర్భంగా, పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.ఈ జయంతిని పురస్కరించుకుని, అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగలకు శాశ్వత గృహాలను అందించే ప్రతిష్టాత్మక పీఎం-జన్మన్ (ప్రధాన్ మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్) పథకం లబ్దిదారుల సొంతింటి కలను సాకారం చేసింది. నూతన గృహాల్లోకి అడుగుపెట్టిన ఆదివాసీ కుటుంబాలు జియ్యమ్మవలస మండలం, అలమండ పంచాయతీ పరిధిలోని నిడగల్ల గూడ గ్రామంలో నిర్మాణం పూర్తయిన నూతన గృహాలకు శనివారం లబ్దిదారులచే ఘనంగా గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. నిడగల్ల గూడలో అన్ని వసతులతో నిర్మించిన ఇళ్లకు పవిత్ర పూజలు చేసి, వేద పండితుల ఆశీస్సుల మధ్య ఆదివాసీ కుటుంబాలు తమ నూతన గృహాల్లోకి సంతోషంగా అడుగుపెట్టాయి. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ లావేటి ఉమామహేశ్వరరావు, సిబ్బంది, స్థానిక గ్రామ పెద్దలు, సర్పంచ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హౌసింగ్ ఏఈ లావేటి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఎప్పుడూ ఉంటుందని . బిర్సా ముండా స్ఫూర్తితోనే ఈ అద్భుతమైన గృహ ప్రవేశాలు జరిగాయి. మిగిలిన ఇళ్లను కూడా త్వరలోనే పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగిస్తాము” అని తెలిపారు. పీఎం జన్మన్ పథకం ద్వారా బిర్సా ముండా జయంతి రోజున తమ సొంతింటి కలను నెరవేర్చినందుకు ఆదివాసీ కుటుంబాలు ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.










