కురుపాం నియోజకవర్గం: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద 2025-26 సంవత్సరానికి సంబంధించి రెండో విడత నిధులను పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గ కేంద్రంలో బుధవారం విడుదల చేశారు. కురుపాం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి ముఖ్య అతిథిగా హాజరై నిధులను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు రెండో విడతగా వారి ఖాతాలో రూ. 7,000 జమ చేయడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 6,000 మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ. 14,000 కలిపి మొత్తం రూ. 20,000 ను సంవత్సరానికి మూడు విడతల కింద రైతులకు అందించడం జరుగుతుందని వివరించారు. కురుపాం నియోజకవర్గంలో 39,084 మంది రైతు సోదర, సోదరీమణులకు రూ. 26.94 లక్షలు పంపిణీ చేయబడుతున్నాయని, ఒక్కో రైతుకు రూ. 7,000 చొప్పున నిధులు జమ అవుతున్నాయని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ఎమ్మెల్యే, రైతులతో కలిసి వీక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ కడ్రక కళావతి, ఐసిడిఎస్ పీడీ కనకదుర్గ, అరకు పార్లమెంటు రైతు అధ్యక్షులు దేవకోటి వెంకట నాయుడు, ఏడిఏ కె శారద, నియోజకవర్గ రైతు అధ్యక్షులు గురాన శ్రీరామ్ మూర్తి నాయుడు, రాష్ట్ర కొప్పల వెలమ డైరెక్టర్ అక్కేన మధుసూదనరావు, రాష్ట్ర ట్రైకర్ బోర్డ్ డైరెక్టర్ పువ్వల లావణ్య, రాష్ట్ర తూర్పు కాపు డైరెక్టర్ శేఖర్ పాత్రుడు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రంజిత్ కుమార్ నాయకో,టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ దత్తి లక్ష్మణరావు, మరడాన తవిటినాయుడు, అరుకు పార్లమెంట్ టిడిపి అధికారి ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, ఎంపీపీ బొంగు సురేష్, ఇతర ప్రజాప్రతినిధులు, కురుపాం ఎంపీడీవో ఉమామహేశ్వరి, ఏవో నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతు కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









