గుమ్మలక్ష్మీపురం మండలం: మన కళ్ల ముందు నడయాడిన దైవం, పుట్టపర్తి సాయి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలు గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఆదివారం కన్నుల పండువగా జరిగాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి హాజరయ్యారు. ముందుగా బాబా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నమస్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో విప్ తోయక జగదీశ్వరి ప్రసంగిస్తూ.. సత్య సాయిబాబా కేవలం ఒక వ్యక్తి కాదని, కులమతాలకు అతీతంగా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసిన మహాశక్తి అని అభివర్ణించారు. నేటి సమాజంలో ప్రశాంత జీవనానికి, ముక్తి మార్గానికి సాయి చూపిన బాట ఆదర్శనీయమని అన్నారు. తన అసాధారణ ఆథ్యాత్మిక శక్తులతో ఎందరో ఆర్తుల సమస్యలకు పరిష్కారం చూపారని, ప్రపంచానికి సాయి సిద్ధాంతం ద్వారా జ్ఞానాన్ని, సన్మార్గాన్ని ప్రబోధించారని కొనియాడారు.మానవసేవే మాధవ సేవ అనే సూక్తాన్ని బాబా వారు కేవలం చెప్పడమే కాకుండా.. విద్య, వైద్యం, తాగునీరు వంటి ఎన్నో బృహత్తర సేవా కార్యక్రమాల ద్వారా ఆచరించి, నిరూపించిన మహనీయుడు అని ఎమ్మెల్యే గుర్తు చేశారు.ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయన చూపిన సేవా మార్గాన్ని స్మరించుకుంటూ, సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) కనకదుర్గ, గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్ ఎన్. శేఖరం పాల్గొన్నారు. వీరితో పాటు కూటమి నాయకులు, రెవిన్యూ మరియు ఐసీడీఎస్ సిబ్బంది, సాయి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బాబా వారి సేవలను కొనియాడుతూ భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.








