- పిఆర్ఎస్ఐని కోరిన ఎ.పి తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్ ఆర్డీ విల్సన్ శరత్ చంద్ర
తిరుపతి : పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా(పిఆర్ఎస్ఐ) ఆధ్వర్యంలో సమాజాన్ని చైతన్యపరిచేలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అలాగే అంతరించిపోతున్న తెలుగు భాష పరిరక్షణకు కార్యక్రమాలు చేపట్టాలని ఎ.పి తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్ ఆర్డీ విల్సన్ శరత్ చంద్ర కోరారు. పిఆర్ఎస్ఐ తిరుపతి చాప్టర్ కార్యవర్గ సభ్యులు సోమవారం తిరుపతి శ్రీ పద్మావతి వర్సిటీలోని సావేరి విశ్రాంతి గృహంలో అకాడమీ ఛైర్మన్ ను కలిశారు. ఈ సందర్భంగా మెమెంటో, శాలువతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా తిరుపతి చాప్టర్ ఛైర్మన్ డా.జిఎస్.ప్రసాద్ మాట్లాడుతూ పిఆర్ఎస్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యకలాపాలను తెలియజేశారు. తెలుగు భాష పరిరక్షణకు అకాడమీ తరఫున కార్యక్రమాలు నిర్వహించేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని చెప్పారు. అకాడమీ ఆధ్వర్యంలో బాలసాహిత్యాన్ని ప్రోత్సహించాలని, తద్వారా భావిపౌరులైన బాలబాలికలు తెలుగు భాషపై మక్కువ పెంచుకుంటారని తెలిపారు. ఇందుకు అకాడమీ ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో పిఆర్ఎస్ఐ తిరుపతి చాప్టర్ వైస్ ఛైర్మన్ ఆచార్య ఎన్.శ్రీరజని, కార్యదర్శి దుద్యాల చంద్రమోహన్, కోశాధికారి కె.మధుసూదన్, కార్యవర్గ సభ్యుడు ఆర్సీ కృష్ణస్వామిరాజు, పూర్వ ఛైర్మన్ ఆచార్య త్రిపుర సుందరి, సభ్యులు రవీంద్ర పాల్గొన్నారు










