పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస: రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. జియ్యమ్మవలస మండలం కె.టి.వాడలో మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన “రైతన్నా… మీకోసం” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చి రైతుల జీవనోపాధి మెరుగుపడేలా కూటమి ప్రభుత్వం పంచ సూత్రాలను రూపొందించిందని తెలిపారు. అవి:
నీటి భద్రత
డిమాండ్ ఆధారిత పంటల వ్యవస్థ
అగ్రిటెక్ అభివృద్ధి
ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోత్సాహం
ప్రభుత్వ మద్దతు మరింత బలోపేతం
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారని ఆమె తెలిపారు. మాట తప్పని ప్రభుత్వంగా అన్నదాత సుఖీభవ నిధుల రూపంలో ₹5,000, పీఎం కిసాన్ నిధుల రూపంలో ₹2,000, మొత్తం రెండు విడతల్లో ₹14,000 రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి, రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసమే ఈ పంచ సూత్రాలతో కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆమె పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఇంటింటికీ వెళ్లి “రైతన్నా మీకోసం” కరపత్రాలను పంపిణీ చేస్తూ, ప్రభుత్వం చేపడుతున్న మరియు చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, మండల కన్వీనర్ జోగి భుంజగరావు, పిఎసిఎస్ చైర్మన్ సోములు మాష్టారు, వట్టిగెడ్డ ప్రాజెక్ట్ చైర్మన్ సత్యం నాయుడు, వైస్ చైర్మన్ ప్రసాద్, మాజీ కన్వీనర్ పల్లా రాంబాబు, జనసేన నాయకుడు శ్రీరామ్, వ్యవసాయ శాఖ, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.










