పార్వతీపురం మన్యం జిల్లా: పార్వతీపురం మన్యం జిల్లాలోని డోకిశీల గ్రామ పరిధిలో గల వివిధ పోలింగ్ బూత్‌లలో పోలింగ్ బూత్ విజిట్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ బోర్డు డైరెక్టర్ పువ్వల లావణ్య ఆదివారం విస్తృత పర్యటన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె పార్వతీపురం ఆదివారంచాకలి బెలగాంలోని 30వ వార్డుకు చెందిన పోలింగ్ బూత్ ఏజెంట్లు, కన్వీనర్లు, క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లను కలుసుకుని సూచనలు అందించారు. అనంతరం 70, 71 పోలింగ్ బూత్‌లు పరిధిలోని రావికోన, బట్టి వలస, అడ్డాలవలస గ్రామాల్లో పర్యటించి ప్రజలతో నేరుగా మాట్లాడారు.
పర్యటనలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ, కూటమి ప్రభుత్వంపై ప్రజలు చూపుతున్న విశ్వాసం మరింత పెరగాలంటే నాయకులు గ్రామస్థులతో మరింత సమన్వయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రతి నాయకుడు ప్రజలను తమతో కలుపుకుని, ప్రతి పథకం నిజంగా లబ్ధిదారుల దాకా చేరేలా చూడాలి అని సూచించారు.
కూటమి ప్రభుత్వం ఇప్పటికే సూపర్ సిక్స్ కార్యక్రమంలో ఉన్న పథకాలను సమర్థవంతంగా అమలు చేసినట్టు గుర్తుచేసిన పువ్వల లావణ్య, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజాభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ బూత్‌ల ఏజెంట్లు, కన్వీనర్లు, క్లస్టర్ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










