పార్వతీపురం మన్యం జిల్లా / జియ్యమ్మవలస మండలం : పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం పరిధిలోని పరజపాడు పంచాయతీకి చెందిన ఆరు గ్రామాల ప్రజలు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్వతీపురం–గుణుపూర్ ప్రధాన రహదారితో అనుసంధానమైన బీటీ రహదారి పూర్తిగా దెబ్బతినడంతో రవాణా శాఖ అధికారులు ఇటీవల బస్సు సర్వీసులను నిలిపివేశారు.
2001లో నిర్మించిన ఈ రహదారి చింతల బెలగం, దత్తివలస, పరజపాడు వలస, పరసపాడు, లక్ష్మీపురం, పిప్పలభద్ర వంటి గ్రామాల ప్రజలకు ప్రధాన ప్రయాణ మార్గంగా ఉంది. అయితే గత కొంతకాలంగా రహదారిపై ఏర్పడిన లోతైన గోతులు, భారీ గుంతల వల్ల బస్సులు నడపడం సురక్షితం కాదని అధికారులు భావించారు. ఫలితంగా గ్రామాల మధ్య రవాణా పూర్తిగా స్థగితమయ్యింది.
గ్రామ సర్పంచ్ జి. రామకృష్ణ బుధవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, బస్సు సర్వీసులు నిలిపివేయడంతో విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు సకాలంలో చేరలేకపోతున్నారని, రోగులు వైద్యం కోసం సమయానికి ఆస్పత్రులకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రయాణం కష్టసాధ్యమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దెబ్బతిన్న రహదారిని ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికన మరమ్మతు చేసి, బస్సు సర్వీసులను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సర్పంచ్ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఆరు గ్రామాల ప్రజలు రవాణా లోపం కారణంగా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.










