- అభ్యర్థుల గెలుపునకు సమన్వయంతో కృషి చేయాలి.
- ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యే బేబి నాయన పిలుపు.
పార్వతీపురం,మన్యం: మత్స్యకార సంఘం ఎన్నికల్లో అందరూ ఐక్యమత్యంతో ముందుకు సాగి, కూటమి మద్దతుదారుల విజయం కోసం కృషి చేయాలని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన పిలుపునిచ్చారు. శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర క్యాంప్ కార్యాలయంలో మత్స్యకార సంఘాల అధ్యక్షులు, నాయకులు మరియు డైరెక్టర్లతో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ నెల 30వ తేదీన జరగనున్న మత్స్యకార సంఘం సొసైటీ ఎన్నికల వ్యూహంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా తోయక జగదీశ్వరి మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్నికల్లో అన్ని డైరెక్టర్ స్థానాలను కైవసం చేసుకునేలా నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఓటర్లను కలిసి ప్రభుత్వ పథకాలను, మత్స్యకారులకు జరుగుతున్న మేలును వివరించాలన్నారు. ఐక్యతతో సాగితే విజయం నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు మోజోరు తేజోవతి, ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, వివిధ రాష్ట్ర డైరెక్టర్లు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.









