జియ్యమ్మవలస మండలం : వ్యాధులు ప్రబలకుండా నిరోధించాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా అత్యంత కీలకమని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు అన్నారు. శుక్రవారం జియ్యమ్మవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) పరిధిలోని గవరంపేట గ్రామాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో, డ్రైనేజీ కాల్వల్లో నీరు నిల్వ ఉండకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాలను ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దడంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని సూచించారు.
వెక్టర్ కంట్రోల్ హైజీన్ యాప్‌ను పరిశీలించిన ఆయన, గ్రామంలో దోమల లార్వా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటి నివారణకు చేపడుతున్న చర్యలపై వైద్య, పంచాయతీ సిబ్బందిని ఆరా తీశారు.
వైద్య సేవలు – గర్భిణీల సంరక్షణపై ప్రత్యేక దృష్టి
గ్రామంలో నిర్వహిస్తున్న సంచార చికిత్సా వైద్య శిబిరం (104)ను సందర్శించిన డాక్టర్ భాస్కరరావు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వారి వివరాలను ఎంసిపి కార్డుల్లో పూర్తిస్థాయిలో నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. అలాగే ఆరోగ్య సర్వే, స్క్రీనింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
‘ముస్తాబు’ కార్యక్రమంపై అవగాహన అవసరం
జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ‘ముస్తాబు’ కార్యక్రమంపై ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థులు మరియు ప్రతి ఇంట్లో అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యాధుల నియంత్రణ మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్‌సీడీ అధికారి డాక్టర్ టి. జగన్‌మోహనరావు, డీపీఎంఓ డాక్టర్ రఘుకుమార్, డీబీసీఎస్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ సూర్య కౌశిక్, వైద్యాధికారి డాక్టర్ పి. జగదీష్, పంచాయతీ సెక్రటరీ ఎ. మోహన్‌రావు, వైద్య సిబ్బంది సునీత, ఈశ్వరమ్మ, 104 సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.









