గుమ్మలక్ష్మీపురం: నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణ పరిష్కారం చూపే దిశగా కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మరో ముందడుగు వేశారు. శనివారం పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఉన్న ఆమె క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్‌ను నిర్వహించారు.
ఈ ప్రజా దర్బార్‌కు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరి వినతులను ఓపికగా విన్న ఎమ్మెల్యే జగదీశ్వరి, సమస్యల స్వరూపాన్ని తెలుసుకుని అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అందిన దరఖాస్తులను ఆలస్యం లేకుండా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి వినతిపై వ్యక్తిగత పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా తమ సమస్యలు నేరుగా ఎమ్మెల్యేకు చెప్పుకునే అవకాశం లభించిందని పలువురు ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.










