గజపతినగరం/కురుపాం: ఉమ్మడి విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను కురుపాం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ శ్రేణులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగింది.
కురుపాం నియోజకవర్గానికి చెందిన సీనియర్ జనసేన నాయకులు నేరేడుమిల్లి వంశీ, తాడేల శ్రీరామ నాయుడు, దక్క చిన్న, కోమటివిల్లి వెంకీ తదితరులు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల సమస్యలు, మౌలిక వసతుల కల్పన, ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, జనసేన నాయకులు ప్రజా సమస్యల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా పని చేస్తుందని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజల గొంతుకగా నిలవాలని జనసేన నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఈ భేటీతో కురుపాం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వ స్థాయిలో సానుకూల స్పందన లభిస్తుందని జనసేన శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశారు.









