పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన జియ్యమ్మవలసలో మంగళవారం 2026 సంవత్సర సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఈ వేడుకలు తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉత్సాహంగా సాగాయి.
మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కె. ధర్మారావు ఆధ్వర్యంలో, మండల విద్యాశాఖాధికారి-2 శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ముఖ్యంగా జానపద నృత్యాలు గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే దేశభక్తిని చాటిచెప్పే గీతాలాపనకు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు సభికులను మంత్రముగ్ధులను చేశాయి.
ఈ పోటీల్లో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంఈఓ-2 శ్రీనివాసరావు మాట్లాడుతూ, మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మూడు బృందాలను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. త్వరలో జరగనున్న జిల్లా స్థాయి సంక్రాంతి సంబరాల్లో జియ్యమ్మవలస మండలం తరపున ఈ బృందాలు ప్రాతినిధ్యం వహించనున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. సంక్రాంతి సంబరాలు జియ్యమ్మవలసలో పండుగ వాతావరణాన్ని సృష్టించాయని పాల్గొన్నవారు తెలిపారు.









