కురుపాం మండలంలోని బియ్యాలవలస గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తూ, మన్యంలో ముస్తాబైన తొలి గ్రామంగా గుర్తింపు పొందిందని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ప్రశంసించారు. బుధవారం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వతంత్ర భారత దేశంలో ఒక అద్భుతమైన గ్రామాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని బియ్యాలవలస ప్రజలు కార్యరూపంలో చూపారని కొనియాడారు. గ్రామస్తుల సమష్టి కృషితో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ఇది జిల్లా యంత్రాంగానికి, ప్రజా ప్రతినిధులకు గర్వకారణమని పేర్కొన్నారు.
బియ్యాలవలస గ్రామ అభివృద్ధిని గుర్తించి రానున్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న పార్వతీపురంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి వేడుకల్లో గ్రామానికి ప్రత్యేక పురస్కారం అందజేయనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పిల్లలు క్రమశిక్షణతో, చక్కగా తయారై రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు గ్రామీణ విలువలు, సంస్కృతి–సంప్రదాయాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు, గ్రామోత్సవం ఎంతో ఉత్సాహంగా సాగాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామాన్ని రంగురంగుల ముగ్గులతో అలంకరించిన మహిళలు, యువతను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అద్భుతమైన రంగవల్లులు రూపొందించిన మహిళలను వేదికపైకి ఆహ్వానించి పేరుపేరునా ప్రశంసించారు. ముఖ్యంగా సంధ్య, జనార్ధన్ లు ఈ కార్యక్రమం కోసం చేసిన కృషిని కలెక్టర్ ప్రత్యేకంగా కొనియాడారు. సంస్కృతి–సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా ప్రతి గడప ముందు రంగురంగుల ముగ్గులతో పండుగ వాతావరణాన్ని సృష్టించిన తీరును చూసి అతిథులు ఆనందం వ్యక్తం చేశారు.
గ్రామస్తులంతా ఏకమై ఉత్సాహంగా పాల్గొనడం గ్రామంలో ఉన్న ఐక్యతకు నిదర్శనమని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కురుపాం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ట్రైకార్ డైరెక్టర్ పువ్వుల లావణ్య, సంయుక్త కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్. వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, జిల్లా పంచాయతీ అధికారి టి. కొండలరావు, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ అధికారులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.









