పార్వతీపురం మన్యం జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు, గిరిజన వారపు సంతల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే, కురుపాం నియోజకవర్గం, కురుపాం మండల కేంద్రంలో గురువారం జరిగిన వారపు సంతలో రావాడ రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. పీహెచ్‌సీ వైద్య అధికారి డాక్టర్ చీకటి శంకర్రావు తమ వైద్య సిబ్బందితో కలిసి ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్రావు మాట్లాడుతూ, వారపు సంతలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరంలో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, రక్త పరీక్షలు కూడా నిర్వహించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి తగిన ఉచిత మందులను కూడా సరఫరా చేసినట్లు ఆయన తెలియజేశారు. గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఈ వారపు సంతల శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.
