పార్వతీపురం/కొమరాడ : గిరిజన మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. కురుపాం నియోజకవర్గ పరిధిలోని కొమరాడ మండలంలో చేపట్టనున్న పలు రహదారి పనులకు కురుపాం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరితో కలిసి బుధవారం కలెక్టర్ శంకుస్థాపన చేశారు.
రూ.23.44 కోట్ల అంచనా వ్యయంతో 11 డోలీ గ్రామాల పరిధిలో 60 బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. దీంతో ఎన్నో దశాబ్దాలుగా సరైన రవాణా సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డోలీ గ్రామాలకు ఇకపై రాకపోకలు సులభం కానున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా కొమరాడ మండలం తీగలపాడు గ్రామం నుంచి జొప్పంగి గ్రామానికి నిర్మించనున్న రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా ప్రొక్లయినర్ నడిపి రహదారి పనులకు శ్రీకారం చుట్టడం విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద మండలంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం భారీ నిధులు మంజూరు చేసిందని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలను అనుసంధానిస్తూ సుమారు రూ.23 కోట్ల 44 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన 11 ప్రధాన బీటీ (డోలీ) రోడ్ల నిర్మాణ పనులకు ప్రజాప్రతినిధులతో కలిసి ఘనంగా శంకుస్థాపన చేసినట్లు చెప్పారు.

ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే గిరిజన ప్రాంతాల్లోని గ్రామాలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు వేగంగా అందే అవకాశం ఉంటుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్నో సంవత్సరాలుగా రహదారి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న తమ గ్రామాలకు రోడ్లు మంజూరు చేసినందుకు కురుపాం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్‌లకు స్థానిక ప్రజలు, నాయకులు సంప్రదాయ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్. వైశాలి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇంజినీరింగ్ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.








