పార్వతీపురం : కుష్ఠు వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందిస్తోందని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కుష్ఠు వ్యాధిపై అవగాహన కార్యక్రమాల గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కుష్ఠు వ్యాధిని నివారించడానికి ప్రభుత్వం ఉచిత మందులను అందిస్తోందన్నారు. వ్యాధిగ్రస్తులను చులకనగా చూడకూడని, వారితో ఆప్యాయంగా మాట్లాడటం వల్ల వారిలో ఆత్మస్టైర్యం కలుగుతుందన్నారు. కుష్ఠు వ్యాధి నిర్ములనపై అవగాహన కార్యక్రమాలను నేటి నుండి వచ్చే నెల 13వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి మండలంలోని పంచాయతీ కార్యాలయం దగ్గర, ప్రతి స్కూల్, హాస్టల్, ఎస్సీ ఎస్టీ కాలనీలలో సర్పంచ్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి జిల్లాలోని ప్రతి పంచాయతీని కుష్టు రహిత సమాజంగా తయారు చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. భాస్కరరావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా. జి నాగభూషణరావు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వై. నాగ శివ జ్యోతి, జిల్లా కుష్టు నిర్మూలన అధికారి డా. వినోద్ కుమార్, ప్రోగ్రాం అధికారులు డా. జగన్ మోహన్ రావు, డా.కౌశిక్, జిల్లా రవాణా అధికారి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









