contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఘనంగా ‘సంపూర్ణ అభియాన్ 2.0’ ప్రారంభోత్సవం

గుమ్మలక్ష్మీపురం: జి.ఎల్.పురం మండలం కుశ గ్రామంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘సంపూర్ణ అభియాన్ 2.0’ (ఆకాంక్షిత జిల్లాలు, ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం) శుక్రవారం అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలోనే అత్యంత అందమైన కుశ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నీతి ఆయోగ్ ‘సంపూర్ణ అభియాన్’ను అమలు చేస్తోందని తెలిపారు.

సాధారణ ప్రసవాల్లో మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు దేశంలోనే ప్రథమ స్థానాల్లో నిలవడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. ఇక్కడి మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ వైద్యుల సూచనలు పాటించడం, పౌష్టికాహారం తీసుకోవడం, నడక వంటి అలవాట్లు పాటించడం వల్లే సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.

గతంలో జనాభా నియంత్రణపై దృష్టి పెట్టామని, ప్రస్తుతం జనాభా వృద్ధిపై ఆలోచన చేస్తున్న మహానేత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ఆమె కొనియాడారు. పిల్లలు ఎక్కువగా పుట్టేలా ప్రోత్సాహకాలు అందించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని, అలాగే పిల్లలందరికీ ‘తల్లి వందనం’ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. స్కూల్ సీట్లు, యూనిఫాంలు, పుస్తకాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తప్పనిసరిగా మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు ఉండాలని, ఇప్పటికే జిల్లాలో ఈ పనులు విజయవంతంగా పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. అంగన్వాడీలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మరుగుదొడ్లు, తాగునీటి వసతులు ఉండాలన్నదే సంపూర్ణ అభియాన్ ప్రధాన లక్ష్యమని గుర్తు చేశారు. ముఖ్యంగా విద్యార్థినుల కోసం ప్రత్యేక మరుగుదొడ్ల సౌకర్యాన్ని పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో సంపూర్ణ అభియాన్ పథకం కింద మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను భద్రంగా ఉంచడంలో టీచర్ల ఓపిక, అంకితభావం కీలకమని మంత్రి ప్రశంసించారు.

గతంలో కలెక్టర్ ప్రారంభించిన ‘ముస్తాబు’ కార్యక్రమం ఎంతో విజయవంతమైందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమం నచ్చడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలతో పాటు అన్ని పాఠశాలల్లోనూ ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు.

ప్రభుత్వం ప్రజలకు అవసరమైన రోడ్లు, సాగునీరు, తాగునీరు అందిస్తూ సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి అన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ అభియాన్ కచ్చితంగా అమలవ్వాలని సూచించారు. మనుషులతో పాటు పాడి పశువుల సంరక్షణకూ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

కుశ గ్రామం రంగురంగుల అలంకరణలతో ఎంతో అందంగా ముస్తాబైందని, కలెక్టర్ ఆలోచన మేరకు అన్ని గ్రామాలు ఇలాగే ఉండాలని ఆమె ఆకాంక్షించారు. అభివృద్ధికి ప్రత్యేక నిధులే అవసరం లేదని, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది సహకారంతో శుభ్రత, మొక్కల నాటకం చేయవచ్చని, ఇదే ‘P4’ భావన అని వివరించారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోటి మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని గుర్తు చేస్తూ, ప్రతి సచివాలయం పరిధిలో కనీసం 10 మొక్కలు నాటాలని సూచించారు. కేవలం నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని, రావి, వేప వంటి నీడిచ్చే చెట్లు గ్రామ జీవనానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

స్థానిక మహిళలు రహదారి సమస్యను ఆమె దృష్టికి తీసుకురాగా, జలపాతం వరకు వెళ్లే రోడ్డును వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పర్యాటకుల కోసం శని, ఆదివారాల్లో ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లను రూ.4,000కు పెంచిన ప్రభుత్వం ఇదేనని, ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల కంటే ఎంతో ఎక్కువని వివరించారు. ముఖ్యమంత్రి నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశంసించారు.

సంపూర్ణ అభియాన్‌ను విజయవంతం చేసేందుకు రాజకీయ నాయకులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, ప్రజలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ రెడ్డి, ఐటిడిఏ పీఓ జగన్నాథ్, ఐసిడిఎస్ పీడీ కనకదుర్గ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు, భామినీ సర్పంచ్ కుసుమ, మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :