పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఉన్న ప్రసిద్ధ శ్రీ కోటదుర్గమ్మ దేవస్థానాన్ని స్థానిక డిఎస్పి ఎం. రాంబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు.
ఈ సందర్బంగా డిఎస్పి ఎం. రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, “రేపటి దసరా సందర్భంగా దేవస్థానానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. కావున అందరూ సమయపాలన పాటించాలి. వాహనాలతో అతివేగంగా ప్రయాణించకుండా, ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి” అని సూచించారు.
అదేవిధంగా, గుమ్మలక్ష్మీపురం మండలం మాలతమ్మ తల్లి దేవస్థానానికి వచ్చే భక్తులు కూడా అధికారులచే ఏర్పాటు చేయబడిన పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు ఉంచాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్విన్‌పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. హరి మాట్లాడుతూ, “నీలకంఠాపురం, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మాలతమ్మ తల్లి దర్శనార్థం దూర ప్రాంతాల నుండి భక్తులు వస్తున్నారు. వారు మద్యం సేవించకుండా, రాష్ డ్రైవింగ్ చేయకుండా, పోలీసుల సూచనలు పాటిస్తూ, శాంతియుతంగా ఉత్సవాలను జరుపుకోవాలి” అని సూచించారు.
భద్రతా ఏర్పాట్లపై ఫోకస్:
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రధాన దేవస్థానాల వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు పార్కింగ్, ఎమర్జెన్సీ సేవలు, మద్యం తనిఖీలు వంటి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.