contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆన్ లైన్ లో అటెండన్స్ లేకుంటే చర్యలు తప్పవు: జిల్లా కలెక్టర్

కురుపాం మండలం : సచివాలయ వ్యవస్థ పనితీరును మరింత మెరుగుపరచడంతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి హితవు పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కురుపాం సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ తనిఖీ సందర్భంగా కొందరు సిబ్బంది ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేయకపోవడంపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది విధిగా ఆన్‌లైన్ హాజరు వేయాలని, అలా చేయని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు సేవలు అందించడంలో అలసత్వం వహిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.

ప్రతి ఉద్యోగి నిర్ణీత సమయానికి కార్యాలయానికి చేరుకోవాలని, ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేయని పక్షంలో ఆ రోజును సెలవుగా పరిగణించడమే కాకుండా సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకపై మండల, జిల్లా స్థాయి అధికారులు నిరంతరం సచివాలయాలను సందర్శించి అటెండెన్స్ రిజిస్టర్లు, ఆన్‌లైన్ లాగిన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని వెల్లడించారు.

అదేవిధంగా ‘మనమిత్ర’ సేవలపై ప్రతి ఉద్యోగికి పూర్తిస్థాయి అవగాహన ఉండాలని, ఈ సేవలను మరింత విస్తృతం చేసి ప్రజలకు సులభంగా అందించాలన్నారు. సచివాలయాల ద్వారా అందుతున్న పౌర సేవలను విస్తరించడంతో పాటు, మిత్ర సేవలను పెంచడం ద్వారా ప్రజలు చిన్న చిన్న పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే పూర్తి చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, సేవల పంపిణీలో పారదర్శకత తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు సేవలను ఇంటి చెంతకే చేరవేయడమేనని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి సచివాలయం ఒక ఆదర్శ సేవా కేంద్రంగా మారాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాధ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :