జియ్యమ్మవలస : ఆంధ్ర రాష్ట్రంలో అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, పేదల పెన్నిధిగా కూటమి ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “పేదల సేవలో ఎన్టీఆర్ పింఛన్ భరోసా” కార్యక్రమం జియ్యమ్మవలస మండలంలో పండుగ వాతావరణాన్ని సృష్టించింది.
ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో, ఒక రోజు ముందుగానే అంటే శనివారం తెల్లవారుజాము నుంచే అధికారులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు చేరుకుని పింఛన్ మొత్తాన్ని అందజేయడం విశేషంగా నిలిచింది. లబ్ధిదారులు తమ ఇళ్ల గడప దాటకుండానే పింఛన్ పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
గవర్నపేట పంచాయతీ పరిధిలోని వెంకటరాజపురం గ్రామంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, వారి గడపపై కూర్చుని యోగక్షేమాలు ఆరా తీస్తూ పింఛన్ డబ్బులను అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అధికారులతో పాటు నాయకులు కూడా ఇంటింటికీ తిరుగుతూ పేదల సమస్యలను అడిగి తెలుసుకోవడం గమనార్హం.
ఈ సందర్భంగా దత్తి లక్ష్మణరావు మాట్లాడుతూ, గతంలో పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు పడిన ఇబ్బందులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గమనించి, వారి కష్టాలను తన కష్టాలుగా భావించారని అన్నారు. నేడు ప్రతి లబ్ధిదారుడు తమ ఇంటి వద్దే గౌరవప్రదంగా పింఛన్ అందుకుంటున్నారని, ఇది కేవలం ఒక పథకం మాత్రమే కాకుండా పేదలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న మమకారానికి నిదర్శనమని పేర్కొన్నారు.
పెంచిన పింఛన్ మొత్తాన్ని, అది కూడా నెల ప్రారంభం కాకముందే అందుకోవడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. “మా ఇంటి బిడ్డ వచ్చి పింఛన్ ఇచ్చినట్టుగా ఉంది” అంటూ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల క్లస్టర్ ఇన్చార్జ్ దాలినాయుడు, టీడీపీ సీనియర్ నాయకుడు దత్తి వెంకట్ నాయుడు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.








