పార్వతీపురం : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం మరియు విద్యా ప్రమాణాల పెంపుదలే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సి. యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో ఏటీడబ్ల్యూఓలు, ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆరోగ్య వివరాలను ప్రతిరోజూ ఉదయం తప్పనిసరిగా HPTS యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, అలాంటి కేసులను వెంటనే ఉన్నతాధికారులకు నివేదించాలని సూచించారు. ప్రతి మూడు నెలలకోసారి హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి, రక్తహీనతతో బాధపడుతున్న వారికి పౌష్టికాహారం అందించాలన్నారు. సికిల్ సెల్ అనీమియా ఉన్న విద్యార్థులకు ప్రత్యేక వైద్య సదుపాయాలు, మందులు అందుబాటులో ఉంచాలని చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకు యోగా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రతి నెలా బ్యాటరీ టెస్టులు నిర్వహించాలని పీడీలు/పీఈటీలు బాధ్యత వహించాలని తెలిపారు. అన్ని విద్యా సంస్థల్లో ఆరోగ్యం, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తరగతి ఉపాధ్యాయులు విద్యార్థుల ఆరోగ్యంపై నిత్యం నిఘా ఉంచాలని సూచించారు. అనారోగ్య లక్షణాలు గమనించిన వెంటనే వైద్య పరీక్షలకు పంపించాలని చెప్పారు. డిప్యూటీ వార్డెన్లు ప్రతిరోజూ హెచ్పిటిఎస్ యాప్‌లో ఆరోగ్య డేటా నమోదు చేయాలని, ప్రధానోపాధ్యాయులు ప్రతి విద్యార్థి ఆరోగ్య చరిత్రను తెలుసుకోవాలని ఆదేశించారు.
ఆర్‌ఓ ప్లాంట్లు, మరుగుదొడ్లు, హాస్టళ్లలో అత్యవసర అవసరాలను తక్షణమే పరిష్కరించాలని పేర్కొన్నారు. టీఎంఎఫ్ నిధులతో టాయిలెట్లు, బాత్‌రూమ్‌లను మరమ్మతులు చేసి శుభ్రంగా ఉంచాలని, నీటి నిల్వ ట్యాంకులకు క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేసి తాగునీటి నాణ్యత పరీక్షించాలని సూచించారు. పాఠశాల మెనూలో మార్పులు చేయకుండా నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే అందించాలని, అనుమతి లేని వ్యక్తులు మరియు బయటి ఆహార పదార్థాలను ప్రాంగణంలోకి అనుమతించకూడదని స్పష్టం చేశారు.
విద్యా ప్రమాణాల పెంపుదలపై దృష్టి సారిస్తూ, రాబోయే ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలు–2026లో 100 శాతం గుణాత్మక ఫలితాల సాధనకు కృషి చేయాలని, అలాగే ఎస్సెస్సీ–2027 కోసం ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. విద్యార్థులను వారి స్థాయి ఆధారంగా ‘షైనింగ్ స్టార్స్’, ‘రైజింగ్ స్టార్స్’గా విభజించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలిపారు. రాత్రి వేళల్లో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో స్టడీ అవర్స్ ఖచ్చితంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
అడ్మిషన్, హాజరు, స్టాక్ రిజిస్టర్లతో పాటు మొత్తం 21 రకాల రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా అవాంఛనీయ సంఘటన చోటుచేసుకున్నప్పుడు 15 నిమిషాల్లోపు ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఏ. విజయశాంతి, ఏటీడబ్ల్యూఓలు, ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








