జియ్యమ్మవలస (వనజ గ్రామం) : పార్వతీపురం మన్యం జిల్లా రాజకీయాల్లో శుక్రవారం ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. గిరిజన ముద్దుబిడ్డగా, మచ్చలేని నాయకుడిగా పేరుగాంచిన మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు జనసేన పార్టీలో చేరారు. జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు వారణాసి శివకుమార్ అధ్యక్షతన నిర్వహించిన ‘క్రియాశీల సభ్యత్వ నమోదు’ కార్యక్రమంలో ఆయన తన సతీమణి మరియమ్మతో కలిసి జనసేన సభ్యత్వం స్వీకరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆయన రాజకీయ దృక్పథమే తనను ఈ నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించిందని జయరాజు తెలిపారు.
ఎన్టీఆర్ గుర్తించిన నాయకుడు… నేడు పవన్ బాటలో
సభ్యత్వం స్వీకరించిన అనంతరం నిమ్మక జయరాజు తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. “నాడు ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఉన్న నన్ను గుర్తించి, 1994లో స్వర్గీయ నందమూరి తారక రామారావు నాకు టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో నాగూరు నియోజకవర్గం నుంచి 33 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచాను. అప్పటి నుంచి నేటి వరకు ప్రజా రాజకీయాలే నా జీవితం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకున్న దృష్టి నన్ను ఆకట్టుకున్నాయి. అందుకే జనసేన సైనికుడిగా పనిచేయాలని నిర్ణయించుకున్నాను” అని పేర్కొన్నారు.
వయస్సు మీద పడినా… ప్రజా సేవలో అదే ఉత్సాహం
70 ఏళ్ల వయస్సులోనూ యువకుడిలా ఉత్సాహంతో జయరాజు జనసేనలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గిరిజన ఏజేఏసీ మన్యం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఆయన గిరిజన హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నారు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఆయన చెప్పారు. ఆయన చేరికతో కురుపాం నియోజకవర్గంలో జనసేన పార్టీకి కొత్త ఉత్సాహం, బలమైన నాయకత్వం లభిస్తుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మండల పార్టీ అధ్యక్షుడు వారణాసి శివకుమార్ మాట్లాడుతూ, “జయరాజు వంటి సీనియర్ నాయకుడు జనసేనలో చేరడం పార్టీకి పెద్ద బలం. ఆయన మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తుంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జయరాజుతో పాటు బీజేపీకి చెందిన ఆగూరు వైకుంఠరావు, బొబ్బిలి వెంకట్ నాయుడు, మాజీ సర్పంచ్ జోగి స్వామినాయుడు, ప్రస్తుత సర్పంచ్‌లు ఉయ్యక చంటి, కొండ గొర్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వందలాది మంది కార్యకర్తలు జనసేన క్రియాశీల సభ్యత్వాన్ని స్వీకరించారు.
సాధారణ ఉపాధ్యాయుడిగా ప్రారంభమైన తన ప్రయాణాన్ని ఎమ్మెల్యేగా ప్రజాభిమానంతో కొనసాగించిన నిమ్మక జయరాజు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసం జనసేనలో చేరడం జిల్లాలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.








