కొమరాడ (దళాయిపేట): చదువు ఒక్కటే మనిషి జీవితంలో చీకట్లను తొలగించి వెలుగులు నింపుతుందని, పేదరికం నుంచి విముక్తి కలిగించే శక్తి విద్యకే ఉందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అడపాక సత్యారావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం సాయంత్రం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన సత్కార సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
కష్టపడితేనే ఉన్నత శిఖరాలు
ఈ సందర్భంగా సత్యారావు మాట్లాడుతూ, నేడు సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రముఖులందరూ చదువుపై ఆసక్తి పెంచుకొని కష్టపడి ఎదిగినవారేనని పేర్కొన్నారు. తన సుదీర్ఘ సేవా కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి నాయకులు, ప్రముఖులను కలిసిన సందర్భాల్లో పొందిన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దాని సాధన కోసం పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.
బాలికా విద్యకు బాటలు
ప్రముఖ కథా రచయిత, కవి గంటేడ గౌరునాయుడు మాట్లాడుతూ దళాయిపేట పాఠశాల అభివృద్ధిలో అడపాక సత్యారావు చేసిన కృషిని కొనియాడారు. కేవలం ప్రాథమికోన్నత స్థాయికే పరిమితం కావాల్సిన ఈ పాఠశాల నేడు పూర్తి స్థాయి హైస్కూల్‌గా ఎదగడంలో ఆయన సహకారం కీలకమైందన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంత బాలికలు ఉన్నత చదువులు అభ్యసించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడేందుకు ఈ పాఠశాల దోహదపడుతుందని తెలిపారు.
పదో తరగతి విద్యార్థులకు అండగా
ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు హాల్ టిక్కెట్లు, పెన్నులు, స్టేషనరీ కిట్లను అడపాక సత్యారావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజాం మండలం గడిముడిదాం గ్రామ సర్పంచ్ ప్రతినిధి ఎల్.బి.పి. నాయుడు కూడా పాల్గొని విద్యార్థులకు సామాగ్రిని అందజేశారు.
అనంతరం పాఠశాల ఉపాధ్యాయ బృందం అడపాక సత్యారావును ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.








