contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఉపాధి హామీ చట్టం పరిరక్షణకై 13న కలెక్టరేట్ వద్ద ధర్నా: సిపిఎం పిలుపు

జియ్యమ్మవలస: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని, ఈ నెల 13వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు పిలుపునిచ్చారు.

బుధవారం జియ్యమ్మవలస మండలం గడసింగపురంలో ఉపాధి హామీ చట్టం పరిరక్షణ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకువచ్చిన విబిజి రాంజీ చట్టంపై గంగునాయుడు తీవ్ర విమర్శలు చేశారు.

గతంలో ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు భరించేదని, అయితే కొత్త చట్టం ప్రకారం అది 60 శాతానికే పరిమితం కానుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 40 శాతం నిధులు ఖర్చు చేసిన తరువాతే కేంద్రం నిధులు విడుదల చేస్తుందన్న నిబంధన దుర్మార్గమైనదని విమర్శించారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భారాన్ని మోయలేక పథకాన్ని నిలిపివేసే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని, దీని వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించారు.

2006లో వామపక్షాల ఒత్తిడితో ఏర్పడిన ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంటే, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ద్వారా దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రజలకు చేసే ద్రోహమని విమర్శించారు.

గ్రామీణ పేదల బతుకుదెరువుకు ఆధారమైన ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అందుకే ఈ నెల 13న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో కూలీలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు భూతాల మోహనరావు, గరుగుబిల్లి రాజు తదితర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :