contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అలర్ట్ అయిన మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : రఘునందన్ రావు

హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు కేసీఆర్ కూతురు కవిత మెదక్ ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు రావడంతో జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు అలర్ట్ అవుతున్నారని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. నిన్న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన అంశంపై రఘునందన్ రావు స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో బావబామ్మర్దులకు పడటం లేదని అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రోద్బలం లేకుండా నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసే అవకాశమే లేదని వ్యాఖ్యానించారు.

ఖర్మ సిద్ధాంతం బీఆర్ఎస్‌కు అనుభవంలోకి వస్తోంది

ఖర్మ సిద్ధాంతం ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు అనుభవంలోకి వస్తోందని రఘునందన్ రావు చురక అంటించారు. ఎవరు ఏం చేస్తే అదే వారికి తిరిగి వస్తుందనడానికి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడమే నిదర్శనమన్నారు. భూమి గుండ్రంగా ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. మనం చేసింది తిరిగి వస్తుందన్నారు. మెజార్టీ ఉన్నప్పటికీ అప్పుడు బీఆర్ఎస్… ఇప్పుడు కాంగ్రెస్… ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పార్టీలను చీల్చడానికి… ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి బీఆర్ఎస్‌కు ఏడేళ్లు పడితే కాంగ్రెస్ పార్టీకి ఏడు నెలలు కూడా పట్టలేదని విమర్శించారు.

ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకుల్లో మార్పు లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పెద్ద జీరో కావడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఆ ఓటు బంగాళాఖాతంలో వేసినట్లే అన్నారు. ప్రోటోకాల్ అంటే ఏమిటో నిన్నటి వరకు బీఆర్ఎస్ నేతలకు గుర్తుకు లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కనీసం అభివృద్ధికి నిధులు ఇవ్వలేదన్నారు. ఈ దుష్టసంప్రదాయం తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు.

అధ్యక్ష పీఠం కోసం కొట్లాట

2009లో కేసీఆర్ అధ్యక్ష పీఠం కోసం జరిగిన కొట్లాట ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్‌లో జరుగుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో బీఆర్ఎస్ పార్టీ ముగిసిన అధ్యాయమే అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని కేటీఆర్ అనడం దారుణమన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పదహారు లోక్ సభ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి 90 అసెంబ్లీ సీట్లు ఉన్నప్పుడే లోక్ సభ ఎన్నికల్లో సింగిల్ డిపాజిట్‌కు పరిమితమైందని… ఇప్పుడు 12 గెలుచుకుంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీని గల్లీలో కాంగ్రెస్, ఢిల్లీలో బీజేపీ దరి చేరనీయదన్నారు.

 

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :