బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఈ వివరాలను వెల్లడించారు.
పశ్చిమమధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఆయన తెలిపారు. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి, ఆ తర్వాత 48 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల వైపుగా పయనించే అవకాశం ఉందని వివరించారు.
ఈ అల్పపీడనం ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇవాళ, రేపు తెలంగాణ అంతటికీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ప్రకటించారు. ఖమ్మం, భద్రాద్రి, మెదక్, వికారాబాద్, భూపాలపల్లి, ములుగు, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించారు.
అలాగే కామారెడ్డి, జనగామ, కుమురం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్ధిపేట, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని నాగరత్న చెప్పారు.
ఈ అల్పపీడనం ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.