Bhadrachalam: తెలంగాణ రాష్ట్రం భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం రాత్రి 9 గంటల సమయానికి గోదావరి నీటి మట్టం 47.7 అడుగులకు చేరింది. నీటి మట్టం 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీని కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామం వద్ద రహదారిపైకి నీరు చేరడంతో దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
గోదావరి దిగువన ఉన్న ముంపు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి మురుమూరు గ్రామం వద్ద వరద నీరు చేరడంతో చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో కల్యాణ కట్ట వరకు వరద నీరు చేరింది. పట్టణంలోకి వరద నీరు రాకుండా అధికారులు కరకట్టకు ఉన్న స్లూయిజ్‌లను మూసివేశారు.