ఓ కాలేజీ అమ్మాయి (20) నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన 63 ఏళ్ల వృద్ధుడ్ని గుజరాత్ లో అరెస్ట్ చేశారు. ఆ వృద్ధుడి పేరు రసిక్ వదాలియా. జంజోథ్ పూర్ లోని సిద్ధసర్ గ్రామానికి చెందిన రసిక్ వదాలియా ఓ రైతు. 10వ తరగతి వరకు చదువుకున్నాడు. సిద్ధసర్ గ్రామంలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అతడి కుమారుడు ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు.
ఇటీవల తన నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గురించి కాలేజీ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులు ఇది రసిక్ వదాలియా పనే అని గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి ప్రశ్నించగా మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. అతగాడు మరో ముగ్గురు కాలేజీ అమ్మాయిలను కూడా ఇదే రీతిలో ట్రాప్ చేసినట్టు తెలిసింది. తాను ఓ కాలేజి స్టూడెంట్ నంటూ ఆన్ లైన్ లో అమ్మాయిలతో పరిచయం పెంచుకుని వారి నగ్న చిత్రాలు సేకరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఆ రైతు రిషి పటేల్ అనే పేరు మీద ఇన్ స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్ ను కొనసాగిస్తున్నాడు. కొన్ని వెబ్ సిరీస్ లు చూసి, వాటి ప్రభావంతోనే ఆ రైతు ఇలా పెడతోవ పట్టాడని పోలీసులు తెలిపారు. అమ్మాయిలతో ఆన్ లైన్ లో పరిచయం పెంచుకుని, తనపై వారికి నమ్మకం కుదిరాక నగ్న చిత్రాలు పంపమని అడిగేవాడు. అలా అతడి ఉచ్చులో చిక్కుకుని నగ్న చిత్రాలు పంపినవారిని బ్లాక్ మెయిల్ చేసేవాడు.
అయితే, అతడు డబ్బు డిమాండ్ చేయకుండా, ఇతర కాలేజీ అమ్మాయిలను తనకు పరిచయం చేయాలని, లేకుంటే నగ్న ఫొటోలు బయటపెడతానని బెదిరించేవాడు. గత రెండేళ్లుగా రసిక్ వదాలియా ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నాడని పోలీసులు వెల్లడించారు. ఓ అమ్మాయి ఫిర్యాదు చేయడంతో ఇన్ స్టాగ్రామ్ ఐడీ, ఐపీ అడ్రస్ ఆధారంగా అతడిని పట్టుకున్నామని తెలిపారు. అతడి ఫోన్ లో మరో ముగ్గురు అమ్మాయిల చిత్రాలు కూడా ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. అతడిపై ఐటీ యాక్ట్, ఐపీసీ 354, 500 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.