తిరుపతి జిల్లా రేణిగుంట మేజర్ పంచాయతీ ఆదాయానికి గండిపడుతోంది. సంబంధిత అధికారులే గండికొట్టడం పంచాయతీ పరిధిలో సంచలనంగా మారింది. రేణిగుంట సంతకు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. మేజర్ పంచాయతీ కావడంతో గ్రామీణ ప్రాంతాల నుండి రైతులు కూరగాయలు తీసుకొచ్చి సంతలో విక్రయిస్తుంటారు. రోజువారీ సంత జరిగే క్రమంలో ఆరు నెలలకో, ఏడాదికో పంచాయతీ అధికారులు వేలంపాట నిర్వహిస్తుంటారు. అలాంటిది ఇటీవల సంతకు గేట్ రుసుము వసూల్ చేసే వేలంపాటను రద్దు చేసారు.
ఇక వేలంపాట రద్దుతో పంచాయతీకి అధికారులు కొందరు రెచ్చిపోతున్నారు. చిరు వ్యాపారుల వద్ద ముక్కు పిండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. అడ్డదిడ్డంగా అందినకాడికి దోచుకుంటున్నారు. ఎలాంటి రసీదు లేకుండా పంచాయతి గేట్ వసూల్ చేస్తున్నారు. వ్యాపారుల వద్దనుండి కూరగాయలు ఉచితంగా తీసుకుపోతున్నారు తెలుస్తోంది. దీంతో వ్యాపారులు, రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులు కోరుతున్నారు.