పల్నాడు జిల్లా రెంటచింతలలో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెంటచింతలకు చెందిన 38 మంది టాటా ఏస్ వాహనంలో శ్రీశైలం వెళ్లి మల్లికార్జునస్వామిని దర్శించుకుని తిరిగి పయనమయ్యారు. మరికాసేపట్లో వారు ఇంటికి చేరుకుంటారనగా ప్రమాదం సంభవించింది. రెంటచింతల విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం ఆగివున్న లారీని బలంగా ఢీకొట్టింది.
దీంతో వాహనంలో ఉన్న వారు ఎగిరి రోడ్డు మీద పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు మొత్తం రక్తసిక్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.