కరీంనగర్ టౌన్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆరేపల్లి ఒకటవ డివిజన్‌లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద చోటుచేసుకున్న మానవీయ ఘటనకు విస్తృత స్పందన లభిస్తోంది. రిపోర్టర్ టీవీ ప్రసారం చేసిన కథనానికి స్పందించిన కరీంనగర్ రూరల్ పోలీస్ అధికారులు, ఎన్నికల విధుల్లో భాగంగా ప్రతి ఓటరికి సహకారం అందించడం తమ బాధ్యతేనని స్పష్టం చేశారు.
నేడు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓ వికలాంగ వృద్ధుడు నడవలేని స్థితిలో ఉండటాన్ని గమనించిన కరీంనగర్ రూరల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి వెంటనే చర్యలు చేపట్టారు. వృద్ధుడికి వీల్‌చైర్ ఏర్పాటు చేసి, స్వయంగా ఆయనను పోలింగ్ స్టేషన్ లోనికి పంపించారు. దీంతో ఆ వృద్ధుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా తన ఓటు హక్కును వినియోగించుకోగలిగారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, “ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ. ప్రతి ఒక్క ఓటరు సులభంగా, స్వేచ్ఛగా ఓటు వేయగలగడం కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతతో పాటు అవసరమైన సహాయం కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం” అని తెలిపారు.
పోలీసుల ఈ మానవీయ చర్యను స్థానికులు అభినందించారు. ఎన్నికల విధుల్లో భాగంగా భద్రతతో పాటు సేవాభావాన్ని ప్రదర్శించిన కరీంనగర్ రూరల్ పోలీస్ సిబ్బందికి ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.








