దేశ రక్షణ సామర్థ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటుతూ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని దిల్లీలో అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. వెంటనే శతఘ్నిలు పేల్చుతూ సైన్యం గౌరవ సూచకంగా శుభాకాంక్షలు తెలిపింది.

తొలుత రాష్ట్రపతి భవన్ నుంచి విదేశీ అతిథులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంప్రదాయ గుర్రపు బగ్గీలో అశ్విక దళంతో కలిసి కర్తవ్యపథ్‌కు బయలుదేరారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరికి ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు.

అనంతరం అంతరిక్ష యాత్ర చేసిన గ్రూప్ కెప్టెన్ శుభాంసు శుక్లాకు రాష్ట్రపతి అశోక్ చక్ర పురస్కారం ప్రదానం చేశారు. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మొదట దేశవ్యాప్తంగా వచ్చిన కళాకారులు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల కళాకారులు వన్ ఇండియా భావనను ప్రతిబింబించారు. నాలుగు MI-17 హెలికాప్టర్లు సభికులపై పూల వర్షం కురిపించాయి.
పరేడ్‌లో భారత సైనిక సామర్థ్యం అద్భుతంగా ప్రతిఫలించింది. టీ-90 అర్జున, టీ-90 భీష్మ ట్యాంకులు, అపాచీ హెలికాప్టర్లు, BMP-3 యుద్ధ వాహనాలు, నాగ్ మిసైల్ వ్యవస్థలు ప్రదర్శించబడ్డాయి. డ్రోన్ వ్యవస్థలు, మానవ రహిత విమానాలు దివ్యాస్త్ర, శక్తిబాన్, ఆధునిక ఆయుధ వ్యవస్థలు ధనుష్, అమోఘ్, బ్రహ్మోస్ క్షిపణి, ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించిన ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇదే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులతో కలిసి పుష్పాంజలి ఘటించి వీరులను స్మరించుకున్నారు.









