కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ ప్రైవేట్ ఆసుపత్రుల నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. కాగజ్‌నగర్ పట్టణంలోని రుద్రా హాస్పిటల్‌లో కాలపరిమితి ముగిసిన గ్లూకోస్ ఎక్కించడంతో రెండున్నర ఏళ్ల చిన్నారి పరిస్థితి విషమించింది. సిర్పూర్ మండలానికి చెందిన బాలుడు జ్వరం రావడంతో శనివారం కుటుంబ సభ్యులు రుద్రా హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు జ్వరం అధికంగా ఉందని చెప్పి చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంతో జూలై 2025లో కాలపరిమితి ముగిసిన గ్లూకోస్ ఎక్కించారు. దీని ఫలితంగా బాలుడికి జ్వరం మరింతగా పెరగడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయాన్ని గమనించిన బాలుడి తండ్రి డాక్టర్లను ప్రశ్నించగా, “చిన్న తప్పిదం జరిగింది.. పెద్ద సమస్యేమీ లేదు” అని నిర్లక్ష్యంగా స్పందించారని సమాచారం.
చిన్నారి ప్రాణాలను నిర్లక్ష్యంగా తీసుకునే ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆరోగ్యశాఖను కోరుతున్నారు. ఇలాంటి ఆసుపత్రుల లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.










