ఢిల్లీ : మొత్తానికి జంతు ప్రేమికులు విజయం సాధించారు. వీధి కుక్కల నియంత్రణ విషయంలో దేశవ్యాప్తంగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ సుప్రీంకోర్టు తాజాగా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో తాను ఇచ్చిన వివాదాస్పద ఆదేశాలను సవరించిన సర్వోన్నత న్యాయస్థానం, వీధి కుక్కల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
వీధి కుక్కలను పట్టుకున్న తర్వాత వాటికి అవసరమైన టీకాలు, డీవార్మింగ్ చికిత్స అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం, వాటిని ఎక్కడి నుంచి పట్టుకున్నారో అదే ప్రాంతంలో తిరిగి విడిచిపెట్టాలని ఆదేశించింది. తద్వారా వాటి ఆవాసాలకు భంగం కలగకుండా చూడాలని సూచించింది.
అయితే, ఈ నిబంధన అన్ని కుక్కలకు వర్తించదని ధర్మాసనం స్పష్టం చేసింది. రేబిస్ వ్యాధితో బాధపడుతున్న కుక్కలను, ప్రజలపై తీవ్ర దూకుడుగా ప్రవర్తించే కుక్కలను గుర్తించి వాటిని వేరు చేయాలని పేర్కొంది. ఇలాంటి ప్రమాదకరమైన కుక్కలకు కూడా రోగనిరోధక టీకాలు వేయాలని, కానీ వాటిని జనావాసాల్లోకి తిరిగి వదలకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెల్టర్లలోనే ఉంచి సంరక్షించాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.
గత ఆగస్టు 8న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కొంత గందరగోళానికి దారితీయడంతో, తాజా సవరణలతో స్పష్టత నిచ్చింది. ఈ కొత్త మార్గదర్శకాలు ప్రజా భద్రతతో పాటు మూగజీవాల సంరక్షణను కూడా సమతుల్యం చేసేలా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.