contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Supreme Court: వీధుల్లో కుక్కలు వద్దు .. అడ్డుకునే వారిపై కఠిన చర్యలని హెచ్చరిక

ఢిల్లీ : వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని నివాస ప్రాంతాల నుంచి వీధి కుక్కలన్నింటినీ వెంటనే పట్టుకుని, ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని సోమవారం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియకు ఎవరైనా అడ్డుతగిలితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని హెచ్చరించింది.

పెరిగిపోతున్న కుక్కకాటు ఘటనలు, రేబిస్ మరణాలపై వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించిన జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు విచారణ చేపట్టింది. “ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయం. ఇందులో ఎలాంటి భావోద్వేగాలకు తావులేదు. తక్షణమే చర్యలు తీసుకోవాలి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వీధి కుక్కల సమస్యపై కేవలం కేంద్ర ప్రభుత్వం వాదనలు మాత్రమే వింటామని, జంతు ప్రేమికులు లేదా ఇతర సంస్థల పిటిషన్లను అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని మున్సిపల్ అధికారులు తక్షణమే ప్రత్యేక డాగ్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. కుక్కలను పట్టుకోవడం, స్టెరిలైజేషన్, టీకాలు వేయడంలో శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని సూచించింది. షెల్టర్ల నుంచి కుక్కలు తప్పించుకోకుండా సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, కుక్కకాటు ఘటనలపై ఫిర్యాదుల కోసం వెంటనే హెల్ప్‌లైన్ ప్రారంభించాలని స్పష్టం చేసింది. అవసరమైతే ఈ పని కోసం ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది.

గతంలో కుక్కల తరలింపు కోసం ఒక స్థలాన్ని గుర్తించగా, జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ తెచ్చారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. “కొంతమంది జంతు ప్రేమికుల కోసం మన పిల్లలను బలివ్వలేం” అని వ్యాఖ్యానించింది. తరలింపును అడ్డుకునే ఉద్దేశంతో వీధి కుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా అనుమతించేది లేదని తేల్చి చెప్పింది.

షెల్టర్లకు తరలించిన ఏ ఒక్క కుక్కను కూడా తిరిగి వీధుల్లోకి వదలకూడదని, ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య ఢిల్లీలో 49 రేబిస్ కేసులు, 35,198 కుక్కకాటు ఘటనలు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పరిస్థితి తీవ్రంగా ఉందని, తక్షణ చర్యలు అత్యవసరమని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :