ఢిల్లీ : వీధి కుక్కల నియంత్రణ విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము జారీ చేసిన ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు పశ్చిమ బెంగాల్, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు (ప్రధాన కార్యదర్శులు) సమన్లు జారీ చేసింది. వారంతా నవంబర్ 3న తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని సోమవారం ఆదేశించింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) రూల్స్, 2023 అమలుపై తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఈ ఏడాది ఆగస్టులోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, చాలా రాష్ట్రాలు పట్టించుకోకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. “అధికారులు వార్తాపత్రికలు చదవడం లేదా? సోషల్ మీడియా చూడటం లేదా? ఆదేశాలు అందకపోయినా, అఫిడవిట్లు ఇక్కడ ఉండాల్సింది. నవంబర్ 3న చీఫ్ సెక్రటరీలందరూ తప్పనిసరిగా కోర్టులో హాజరు కావాలి” అని జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది.
పశ్చిమ బెంగాల్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశాయని కోర్టు గుర్తించింది. “దేశంలో వీధి కుక్కలకు సంబంధించిన ఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల విదేశాల దృష్టిలో మన దేశ ప్రతిష్ఠ దెబ్బతింటోంది. మేం కూడా వార్తా కథనాలను చదువుతున్నాం” అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదే సమయంలో, ఈ కేసులో తమను కూడా భాగస్వాములను చేయాలని కోరుతూ వివిధ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWA), వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లపై కూడా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. “దేశంలోని RWAలన్నీ ఈ కేసులో పార్టీలుగా చేరతామంటే, మన ముందు కోట్లాది మంది ఉంటారు కదా? సహేతుకమైన సూచనలు చేయండి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
తదుపరి విచారణ తేదీన చీఫ్ సెక్రటరీలు హాజరు కాకపోతే, కఠిన చర్యలతో పాటు జరిమానాలు కూడా విధిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఢిల్లీ విషయంలో ఎంసీడీ ఇచ్చిన నివేదిక సరిపోదని, అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
కాగా, ఆగస్టు 22న ఇచ్చిన ఆదేశాల ప్రకారం, కుక్కల స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలతో పాటు, వాటి కోసం ఏర్పాటు చేసిన షెల్టర్ల వివరాలతో అన్ని రాష్ట్రాలు నివేదికలు సమర్పించాల్సి ఉంది. ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 3న జరగనుంది.









