ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “జగన్‌కు అధికారం సూట్ కాలేదు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆయన అసలు నైజం బయటపడిందని, తన స్వభావాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని 2027లో జగన్ చేపట్టనున్న పాదయాత్రపై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం విజయవాడలోని ఏపీ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ,
“ఒక మనిషి నిజమైన స్వభావం తెలుసుకోవాలంటే అతడికి అధికారం ఇచ్చి చూడాలని అబ్రహం లింకన్ అన్నారు. మనం జగన్‌కు అధికారం ఇచ్చి చూశాం. ఆయన పనితీరు ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసు. జగన్‌కు అధికారం సూట్ కాలేదని అర్థమైంది” అని అన్నారు.
జగన్‌లో స్వార్థం తగ్గి, ప్రజలకు సేవ చేసే గుణం పెరగాలని షర్మిల సూచించారు. అప్పటివరకు దేవుడు కూడా కరుణించడని, ప్రజలు కూడా ఆదరించరని వ్యాఖ్యానించారు. 2027 జూలైలో చేపట్టే పాదయాత్ర గురించి ఇప్పుడే ప్రకటించడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు.
“ఆ యాత్ర ప్రజల కోసం కాదు… కేవలం అధికారం కోసం మాత్రమే. మేము ఇప్పుడు ఉపాధి హామీ కూలీల కోసం యాత్ర చేస్తున్నాం. జగన్ ఎవరి కోసం, ఏ ప్రయోజనం కోసం పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలి” అంటూ నిలదీశారు.
గత ఐదేళ్ల పాలనలో జగన్ ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని షర్మిల సవాల్ విసిరారు.
“మద్యపాన నిషేధం హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక నకిలీ మద్యంతో రాష్ట్రాన్ని ముంచారు. వేల కోట్ల రూపాయలు సంపాదించారు. వేల ఏళ్ల నాటి రుషికొండను బోడిగుండు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల మధ్యకు ఎప్పుడైనా వచ్చారా? కనీసం సొంత పార్టీ నాయకులకైనా అపాయింట్‌మెంట్ ఇచ్చారా?” అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఎన్నికలకు ముందు మాత్రమే ‘సిద్ధం’ సభల పేరుతో హడావుడి చేశారని ఆరోపించారు. వైఎస్సార్ ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని, ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు.
జగన్ మళ్లీ రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే తన ప్రవర్తన, నైజాన్ని మార్చుకోవడమే ఏకైక మార్గమని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.









