- పెండింగ్ పనులను పూర్తి చేయకపోతే చర్యలు తప్పవు
- కమిషనర్ హరిత
తిరుపతి- మే-20 : తిరుపతి నగరంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పనులను చేసేందు అనుమతి పొంది కూడా పనులు జాప్యం చేయడంపై కాంట్రాక్టర్లను ప్రశ్నిస్తూ, చేపట్టిన పనులను వేగవంతం చేయాలని తిరుపతి స్మార్ట్ సిటీ ఎం.డి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఆదేశాలు జారీ చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను చేపట్టిన కాంట్రాక్టర్లతో, స్మార్ట్ సిటీ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ హరిత ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తిరుపతి అభివృద్దికి, ప్రజల సౌకర్యం కోసం చేపట్టిన ప్రాజెక్టులను సాగతీస్తున్నారని, పూర్తి చేయాల్సిన సమయానికి పూర్తి చేయకుండా కారణాలు చెప్పడాన్ని కమిషనర్ హరిత అభ్యంతరం చెబుతూ ప్రాజెక్టుల పూర్తికి ఫేమెంట్స్ తీసుకొని కూడా కాలయపన చేయడం తగదన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు పూర్తి అవడం కోసం నగర ప్రజల్లో అపోహలు రావడాన్ని గుర్తించాలని, కాంట్రాక్టర్ల తప్పులకు తాము బాధ్యులు అవ్వాల్సిన పని లేదని, ప్రతి ప్రాజెక్ట్ రేపు నెల జూన్ చివరికల్లా పూర్తి కావల్సిందేనన్నారు. పెద్ద ప్రాజెక్టులు జూన్ చివరికల్లా ఓక తుది రూపుకి రావల్సిందేనని చెబుతూ నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తీసుకోవల్సి వస్తుందని కమిషనర్ హరిత హెచ్చరికలు జారీ చేసారు. ఒకొక్క ప్రాజెక్ట్ గురించి కమిషనర్ హరిత చర్చిస్తూ మిగిలిన పనులను ఎంత కాలంలో పూర్తి చేస్తారని కాంట్రాక్టర్లను అడుగగా, వారు చెప్పిన తేదీలను అధికారులతో చర్చించి ఖరారు చేస్తూ చెప్పిన సమయానికల్లా పనులు పూర్తి చేయాలన్నారు. వినాయకసాగర్ మొదటి దశ పనులను, వినాయకసాగర్ షాపింగ్ కాంప్లెక్స్ గ్రౌండ్, మొదటి అంతస్థు పనులను, సిటీ ఆఫరేషన్ సెంటర్ పౌండేషన్ పనులను, ఇండోర్ స్టేడియం పనులను, నీటి శుద్ది ప్లాంట్ పనులను, గొల్లవానిగుంట క్రికెట్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ లాంటివి జూన్, జూన్ చివరికల్లా పూర్తి చేయడము, ఓక రూపుకు తీసుకు రావడం జరగకపోతే తాము తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. స్మార్ట్ సిటీ అధికారులకు, ఇంజనీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తూ పనులు చేయకుండా నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్ల వివరాలను నమోదు చేయాలని అదేవిధంగా నగరంలో చేపట్టిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల పనులను ప్రతిరోజు పర్యవేక్షించాలని తిరుపతి స్మార్ట్ సిటి ఎం.డి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఆదేశాలు జారీచేసారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, డిఈలు విజయకుమార్ రెడ్డి, రవీంద్రరెడ్డి, దేవిక, మేనేజర్ చిట్టిబాబు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.