అమెరికా : ఇంటర్నెట్ సేవల్లో సంచలనం సృష్టించిన స్టార్ లింక్ పై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్థ అంతరిక్షంలోకి పంపిస్తున్న ఉప గ్రహాలు భూమిపై పడిపోతున్నాయని చెబుతున్నారు. రోజుకు రెండు మూడు శాటిలైట్లు ఇలా నేల రాలుతున్నాయని, ఈ ఉపగ్రహాల వల్ల లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో చెత్త పేరుకుపోతోందని అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధకుడు జోనాథన్ మెక్ డోవెల్ వివరించారు. భవిష్యత్తులో లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో కొత్త ఉపగ్రహాలకు చోటే లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం భూమి చుట్టూ 8 వేలకు పైగా స్టార్ లింక్ సంస్థకు చెందిన శాటిలైట్లు తిరుగుతున్నాయని అంతరిక్ష నిపుణులు తెలిపారు. తన సేవలను విస్తరించే క్రమంలో స్టార్ లింక్ మరిన్ని ఉప గ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు. దీంతో భూమి చుట్టూ లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో తిరిగే స్టార్ లింక్ శాటిలైట్ల సంఖ్య 30 వేలకు చేరనుందని, వీటికి 20 వేల చైనా శాటిలైట్లు కూడా తోడవుతాయని చెప్పారు.
స్టార్ లింక్ పంపించే ఉప గ్రహాల జీవిత కాలం సుమారు 5 నుంచి 7 సంవత్సరాలని గుర్తుచేశారు. కాలంచెల్లిన తర్వాత ఆ ఉపగ్రహాలు లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోనే తిరుగుతుంటాయని, కొన్ని భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోతూ నేల రాలుతాయని చెప్పారు. ఈ ఉపగ్రహాల వల్ల లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో చెత్త పేరుకుపోతుందని, భవిష్యత్తులో కొత్త ఉపగ్రహాలకు చోటులేకుండా పోతుందని హెచ్చరించారు.