మహిళా సమస్యలపై రాజ్ భవన్ వేదికగా మహిళా దర్బార్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా దర్బార్‌కు హాజరైన కొందరు మహిళలు ఇటీవల ఆమ్నేషియా పబ్ సమీపంలో చోటుచేసుకున్న గ్యాంగ్ రేప్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు అందుకున్న తర్వాత తమిళిసై మాట్లాడుతూ… ఈ మధ్య ఏం జరుగుతోందో చూస్తూనే ఉన్నామని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ గ్యాంగ్‌రేప్‌పై తనకు ప్రభుత్వం నివేదిక ఇవ్వలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత నేరుగా కేసీఆర్ సర్కారునే టార్గెట్ చేసిన గవర్నర్.. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్‌ను గౌరవించమని ప్రభుత్వానికి చెబుతున్నానంటూ ఆమె ఓ కీలక వ్యాఖ్య చేశారు. మహిళలకు, ప్రభుత్వానికి వారధిలా ఉండాలని అనుకుంటానని చెప్పిన గవర్నర్… దీనికి ఎదురు చెప్పే వారి గురించి తాను పట్టించుకోనని తెలిపారు.
అనంతరం తన సత్తా ఏమిటన్న విషయాన్ని ప్రస్తావిస్తూ… ప్రజల పక్షాన బలమైన శక్తిగా ఉంటానని తమిళిసై పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్నానని ఆమె చెప్పారు. తాను ఉత్ప్రేరకం మాత్రమేనని చెప్పిన తమిళిసై.. మనమే గెలుస్తామని సంచలన వ్యాఖ్య చేశారు. ఈ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని కూడా ఆమె చెప్పారు. తనను ఆపే శక్తి ఎవరికీ లేదని కూడా ఆమె చెప్పుకొచ్చారు.