వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఒక మహిళను ఆమె అల్లుడు నడిరోడ్డుపై మాంసం నరికే కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం, తాండూరులో నివసిస్తూ మాంసం విక్రయించే పద్మమ్మ (వయస్సు సుమారు 50 సంవత్సరాలు) రోజువారీగా మల్లప్ప మాడిగే వద్ద తన వ్యాపారంలో నిమగ్నమై ఉండేది. అయితే ఈరోజు ఉదయం, ఆమె మాంసం విక్రయిస్తుండగా ఆమె అల్లుడు వెంకటేష్ (సాయిపూర్ గ్రామం నివాసి) అకస్మాత్తుగా అక్కడికి చేరి, పాత కక్షలతో మాంసం కత్తిని ఉపయోగించి ఆమెపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
సమాచారం అందుకున్న తాండూరు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం, నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో, కుటుంబ విభేదాలే హత్యకు కారణంగా కనిపిస్తున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.