అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ రోజు సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. వచ్చే నెలలో హైదరాబాద్ నగర పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై చర్చించడానికి ఆయన నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు నేతలతో సమావేశం కానున్నారు. ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి మద్దతునిచ్చి, వారి గెలుపు కోసం కృషి చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. తన సొంతూరు నారావారిపల్లెలో ఉన్న చంద్రబాబు సాయంత్రం ఉండవల్లికి రానున్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ను ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసింది. నవంబర్ 11వ తేదీన పోలింగ్, 14న ఫలితాలు వెలువడనున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 21వ తేదీ వరకు నామినేషన్ దాఖలుకు గడువు, 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది.