హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేసింది. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించి, అనంతరం పంచాయతీ ఎన్నికల వైపు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించే ప్రక్రియలో అధికారులు నిమగ్నమయ్యారు.
సెప్టెంబరు రెండో వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రెండు కీలక బిల్లులు ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొందాయి. వచ్చే సోమవారం లేదా మంగళవారం నాటికి ఈ మేరకు జీవో జారీ అయ్యే అవకాశం ఉంది.
ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తన పనిని ముమ్మరం చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం తుది ఓటర్ల జాబితాను సెప్టెంబరు 10న విడుదల చేయాలని నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబరు 6న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శన, 8న రాజకీయ పార్టీలతో సమావేశం, అభ్యంతరాల స్వీకరణ అనంతరం 10న తుది జాబితా విడుదల కానుంది.
హైకోర్టు ఇప్పటికే సెప్టెంబరు 30లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం, ఈసీ వేగంగా కదలికలు చూపుతున్నాయి. రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం, అడ్వొకేట్ జనరల్‌తో చర్చించి 2018 పంచాయతీరాజ్ చట్టానికి అవసరమైన సవరణలు చేసినట్టు మంత్రులు వెల్లడించారు. కోర్టుల్లో వ్యాజ్యాలు వచ్చినా, తీర్పుకు లోబడే విధంగా వ్యవహరించనున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలు చేపట్టడం వల్ల ఏడాదిన్నరగా పాలక మండళ్లు లేకపోవడంతో నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులను తిరిగి పొందేందుకు మార్గం సుగమం కానుంది.