హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మీ సేవ కేంద్రాల్లో అందించే వివిధ సేవలపై రుసుములను ప్రభుత్వం గణనీయంగా పెంచింది. సుమారు 50 శాతం మేర ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. ఈ కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తాజా నిర్ణయం ప్రకారం, ఆదాయ, కుల, స్థానికత వంటి ధృవీకరణ పత్రాల జారీకి వసూలు చేసే రుసుమును రూ.80కు పెంచారు. జనన ధృవీకరణ పత్రం రుసుం రూ.62గా నిర్ణయించారు. అదేవిధంగా కేటగిరీ ‘ఏ’ మరియు కేటగిరీ ‘బీ’ కింద వచ్చే దాదాపు అన్ని సేవలపై కూడా ధరలు పెరిగాయి.
ఇప్పటి వరకు కేటగిరీ ‘ఏ’ కింద కనీస ఛార్జీ రూ.35 ఉండగా, తాజాగా దానిలో మార్పులు చేసి సేవల రుసుములను పెంచారు. ఈ కేటగిరీలో అడంగల్, పహాణీ వంటి తక్షణ సేవలు ఉంటాయి. ఇక కేటగిరీ ‘బీ’ సేవలకు, అంటే దరఖాస్తు అనంతరం ప్రాసెస్ అయ్యే కుల, ఆదాయ ధృవీకరణ వంటి సేవలకు ఛార్జీని రూ.80కు పెంచారు.
మీ సేవ కేంద్రాల నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో రుసుములను సవరించాలని నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం ధరల పెంపు నిర్ణయం తీసుకుంది.
విద్యా సంవత్సరం ప్రారంభం సమీపిస్తున్న సమయంలో విద్యార్థులకు అవసరమైన కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలపై రుసుములు పెరగడం గమనార్హం. ఈ నిర్ణయం సామాన్య ప్రజలపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.









