హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర స్థాయిలో ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) కార్యాలయంలో ప్రత్యేకంగా ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
రహదారుల్లో ఇబ్బందులు, ఇంజినీరింగ్ సమస్యలు తలెత్తితే ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా 040 – 35174352 టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ప్రతి సర్కిల్ స్థాయిలో సూపరింటెండెంట్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఉన్న కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో అత్యవసర పరిస్థితులు తలెత్తితే స్థానిక అధికారులు వెంటనే స్పందించేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలు కూడా ఎక్కడైనా రహదారులు దెబ్బతిన్నా, కల్వర్టులు కూలినా, గండ్లు పడినా వెంటనే సంబంధిత నెంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.