హైదరాబాద్ : తెలంగాణలో గతంలో నిర్వహించిన గ్రూప్-2 నియామకాల ప్రక్రియపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2015-16 నోటిఫికేషన్‌కు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తమ ఆదేశాలను ఉల్లంఘించి, పరిధి దాటి వ్యవహరించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం జవాబు పత్రాల్లో వైట్నర్ వాడకం, దిద్దుబాట్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ట్యాంపరింగ్ జరిగినట్లు స్పష్టంగా తెలుస్తున్నా, అలాంటి జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. సాంకేతిక కమిటీ సూచనల మేరకు పునర్మూల్యాంకనం చేపట్టాలని ఆదేశించింది. ఈ మొత్తం ప్రక్రియను 8 వారాల్లో పూర్తిచేసి, కొత్తగా అర్హుల జాబితాను ప్రకటించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది.
టీజీపీఎస్సీ 2015లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయగా, 2016 నవంబర్‌లో రాతపరీక్షలు నిర్వహించింది. అనంతరం 2019లో నియామకాలు చేపట్టింది. అయితే, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో అప్పటి నుంచి ఉద్యోగాల్లో ఉన్నవారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.









