తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సోమవారం శ్రీకారం చుట్టారు. ముందుగా పనపాకం పంచాయతీకి విచ్చేసిన ఎమ్మెల్యే కి మహిళలు కర్పూర హారతులు పట్టారు. అనంతరం కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పనపాకం పంచాయతీలోని సమస్యలను ప్రజలను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. పంచాయతీలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు. గత సంవత్సర పాలనలో చంద్రగిరి మండలంలో చేసిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. గడిచిన 5 సంవత్సరాలలో పనపాకం పంచాయతీ అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రగిరి మండలాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామన్నారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే నా ప్రధమ లక్ష్యం అని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి ఎమ్మెల్యే అర్జీలు స్వీకరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చిన పనపాకం పంచాయతీ ప్రజలకు పేరు పేరునా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మెగా డీఎస్సీ పై తొలి సంతకం, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు, ఎన్.టీ.ఆర్ భరోసా పింఛను, యువతకు ఉద్యోగాలు, దీపం పథకం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలతో పాటుగా ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్నరని తెలిపారు. గత ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పిదాల వలన రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. స్వార్థ రాజకీయాల కోసం చంద్రగిరి మండలం అభివృద్ధి నోచుకోలేదన్నారు. మండలంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సంస్థ ఆధ్వర్యంలో సుమారు 600 కుట్టు మిషన్లను అందజేశామన్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. చంద్రగిరి మండలం పరిధిలో అన్నదాత సుఖీభవ పథకంలో 4504 రైతులకు సుమారు 2కోట్ల 94 లక్షల రూపాయలు మంజూరు చేశారన్నారు . పనపాకం పంచాయతీలో సుమారు 90% ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువచేసామన్నారు . కొన్ని అనివార్య కారణాలవలన కొంతమందికి పథకాలు అందలేదని, అందని వారి యొక్క సమస్యను అధికారుల వద్దుకు తీసుకువెళ్లితే సమస్య పరిష్కారం చూపుతారని ఎమ్మెల్యే ప్రజలకు తెలిపారు. అనంతరం పనపాకం పంచాయతీలోని సమస్యలను అర్జిల రూపంలో తీసుకొని, మరికొన్ని సమస్యలు ఎమ్మెల్యే ప్రజలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు తెలిపిన సమస్యలు రేషన్ , ఫించను, ఇంటి పట్టాలు, భూసమస్యలను, పోలీస్ ఔట్ పోస్ట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పనపాకం నుండి అనుపల్లి రోడ్డు, ఆవుల ఆసుపత్రి ప్రధాన సమస్యలుగా గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా అధికారులకు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
