దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2020 సత్తాంకుళం తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో మధురైలోని మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన 9 మంది పోలీసులకు మరణశిక్ష (డబుల్ డెత్ సెంటెన్స్) విధిస్తూ న్యాయస్థానం కఠిన నిర్ణయం తీసుకుంది.
కేసు నేపథ్యం
తమిళనాడు తూత్తుకుడి జిల్లా సత్తాంకుళంలో నివసించే జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్ స్థానికంగా మొబైల్ షాపు నడుపుతుండేవారు. 2020 జూన్ 19న కోవిడ్-19 లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణతో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో తండ్రిని పోలీసులు కొడుతుండటాన్ని అడ్డుకున్న బెనిక్స్ను కూడా అరెస్ట్ చేశారు.
అనంతరం ఇద్దరినీ రాత్రంతా తీవ్రంగా హింసించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. మరుసటి రోజు ఆధారాలను చెరిపివేయడానికి ప్రయత్నాలు కూడా జరిగాయని దర్యాప్తులో తేలింది. అనంతరం వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచి కోవిల్పట్టి సబ్‌జైలుకు తరలించారు. అయితే పోలీసుల దాడులతో తీవ్రంగా గాయపడిన తండ్రీకొడుకులు జూన్ 23న కొద్ది గంటల వ్యవధిలోనే మరణించారు.
ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి నిరసనలు చేపట్టాయి.
సీబీఐ దర్యాప్తు
ఈ ఘటనపై సుమోటోగా స్పందించిన మద్రాస్ హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. మొత్తం 10 మంది పోలీసులపై కేసు నమోదు కాగా, విచారణ సమయంలో ఒకరు కోవిడ్ కారణంగా మరణించారు. మిగిలిన 9 మందిపై విచారణ కొనసాగింది.
సీబీఐ దర్యాప్తులో బాధితులు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించలేదని, వారిపై తప్పుడు కేసులు నమోదు చేసినట్లు తేలింది. అదేవిధంగా, హింస అనంతరం గాయాల నుంచి కారిన రక్తాన్ని వారితోనే శుభ్రం చేయించారన్న విషయాలు బయటపడ్డాయి. సుమారు 2500 పేజీల ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టులో దాఖలు చేసింది.
ఐదేళ్లకు పైగా సాగిన విచారణ అనంతరం మధురై కోర్టు గత నెల 23న 9 మంది పోలీసులను దోషులుగా తేల్చింది. శిక్షపై విచారణ అనంతరం ఏప్రిల్ 6న న్యాయమూర్తి ముత్తుకుమారన్ తుది తీర్పు వెలువరించారు.
బాధిత కుటుంబం స్పందన
ఈ తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యురాలు పెర్సీ మాట్లాడుతూ, “మాకు న్యాయం జరిగింది. మేము న్యాయస్థానంపై నమ్మకం ఉంచాం. మేము అనుభవించిన బాధను మరెవ్వరూ అనుభవించకూడదు. ఇలాంటి ఘటనలు ఇక పునరావృతం కాకూడదని ఆశిస్తున్నాం” అని తెలిపారు.
ఈ తీర్పు దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థపై బాధ్యతను మరింతగా గుర్తు చేస్తూ, కస్టడీ హింసపై కఠిన చర్యలకు నిదర్శనంగా నిలిచింది.








