తిరుపతి జిల్లా పాకాల మండలంలో మండల స్థాయి చెస్ పోటీలు ఈ నెల 26వ తేది ఆదివారం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ పాకాల అధ్యక్షుడు పోతుగుంట అనీల్ తెలిపారు. దామలచెరువు గ్రామం మంగినాయనపల్లెలో గురువారం ఉదయం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ పాకాల, సత్యం చారిటబుల్ ట్రస్ట్, సహచర సమాంతర ఆలోచనల సామాజిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న ఈ పోటీల్లో పాకాలతో పాటు చుట్టుపక్కల మండలాలలో చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చునని చెప్పారు. పోటీలు పాకాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 26 వ తేదీ ఆదివారం ఉదయం 9.00 గంటలకు ప్రారంభం అవుతాయని, విద్యార్థులు 8.30 గంటలకే రావాలని సూచించారు. పోటీదారులను అండర్ 7, అండర్ 9, అండర్ 11, అండర్ 13, అండర్ 15 వయసు ప్రకారం అయిదు గ్రూపులుగా ఏర్పాటు చేసి, ప్రతి గ్రూపులో మొదటి, రెండవ, మూడో స్థానాల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించనున్నట్టు ప్రకటించారు. అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిస్పేషన్ సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్టు చెప్పారు. అంతేకాకుండా చెస్ అంటే ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ సందర్భంగా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పాకాల సెక్రటరీ మారసాని మహేష్ బాబు, ట్రెజరర్ మారసాని నాగేంద్ర, అడ్మినిస్ట్రేటర్ మారసాని విజయబాబు పాల్గొన్నారు.
